అప్పు విషయంలో గొడవ..  ఓ వ్యక్తి మృతి .. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలో ఘటన

అప్పు విషయంలో గొడవ..  ఓ వ్యక్తి మృతి .. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలో ఘటన

నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : చేసిన అప్పుకు వడ్డీ చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శంభులింగం (60) కొన్ని రోజుల కింద అదే గ్రామానికి చెందిన సూర ఆంజనేయులు వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత శంభులింగం అప్పును మొత్తం చెల్లించినప్పటికీ.. వడ్డీ కింద రూ. 80 వేలు రావాలంటూ ఆంజనేయులు వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బుధవారం ఆంజనేయులు తన ఇంటికి శంభులింగంను పిలిపించుకొని మాట్లాడాడు. ఈ క్రమంలో అసలు, వడ్డీ కలిపి గతంలోనే మొత్తం కట్టేసినట్లు, ఇక చెల్లించలేనని శంభులింగం చెప్పడంతో ఆగ్రహానికి గురైన అంజనేయులు అతడిపై దాడి చేశాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి శంభులింగంను సమీపంలోని కామినేని హాస్పిటల్‌‌‌‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌తీసుకుంటూ శంభులింగం చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై విష్ణు తెలిపారు. సూరా  ఆంజనేయులు తండ్రి రాములు సైతం 2014 సంవత్సరం కంటే ముందు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని మోసం చేశారని, అతడిపై అప్పటి పోలీసులు కాల్ మనీ వేధింపుల కేసులు నమోదు చేశారని సమాచారం.